..
madiki tochinadi...manasuki nachinadi.

Saturday, 5 May 2012



ఆనంద క్షణాన ఆహ్లాద డోలికల్లో మది పయనించే,
     స్వేచ్చాయుత  శ్వేత కపోతంలా ....
     ఆకశాన  చంద్రుడు చిరుగాలి  సాక్షిగా  కురిపించే,  
      వెండివెన్నెలను  తుషార జలపాతంలా ....
           ఆమని  జిలుగుల అంబరాన్ని మేఘుడు చుంబించే,
            నవజాత శిశుకుసుమంలా.....
             ఆరాధనల  ఆస్వాదనలో పుడమి మైమరచే,
               వరుణుని రాకతో గ్రీష్మతాపం  దహించేలా.....





Tuesday, 1 May 2012

ప్రియమగు భార్య సన్నిధికి ప్రేమగ నీ పతి వ్రాయు లేఖ, ఆ
దయగల దైవమే మనల దారుణరీతిని వేరు జేసె, యీ
వయసున నొంటిగా బ్రతుకు భారము నీడ్చుట కష్టమే సుమీ!
అయినను నీ స్మృతుల్ కవితలల్లుచు కాలము నెట్టుచుంటి నే

చూచి యేళ్ళు దాటె నీ చిన్నకొడుకుని,
పక్షమయ్య పెద్దవాని గలసి                    
ఎవరి బ్రతుకు వారి దీ తండ్రి కోసమై
సమయమీయ నెవరి సాధ్యమగును!

కన్నకొడుకులు నన్నింత కనికరించి
వృద్ధ శరణాలయమ్మున వేసినారు
నెలకి చెరి యైదువందల నిచ్చుచుండి
రింత యైనను చేయు వారెంతమంది?

ఐన నదేమొగాని హృదయమ్మున నొక్క విషాదరేఖ, దుః
ఖానల తప్తమైనటుల ఆత్మ తపించుచునుండె, గుండెలో
యే నరమో కలుక్కుమను యే గతజీవిత జ్ఞాపకమ్ములో
మానసవీధిలో నిలచి మాటికి మాటికి గేలిసేయగా!

ప్రక్కచూపులు చూడ పసిగట్టి ఒక మొట్టి
కాయను నెత్తిపై వేయు చేయి,
గోరుచుట్టైనపుడు కొసరి గోర్ముద్దలు
ప్రేమ మీరగ తినిపించు చేయి,
పొలమారినంతనె తలచెనెవరో యంచు
తలపైని పలుమార్లు తట్టు చేయి,
నడిరేయి దడబుట్టి తడబాటుతో లేచి
నప్పుడు గుండెల నద్దు చేయి,

పట్టి వీడననుచు నొట్టు బెట్టిన చేయి
పట్టు వీడె, బ్రతుకు వట్టి పోయె!
ఒక్క చేయి రాదె ఓదార్పు నీయగా
మ్రోడులేమొ! యెదలు బీడులేమొ!

నీడవైన నీవే నను వీడినావు
ఆదరింతురె నన్నింక అయినవారు?
కట్టె ముట్టించుటకె వేచె కన్నకొడుకు
లక్కటా! యేల జీవిత మారిపోదు?

ప్రతి ఉదయము సూర్యుడు నను,
"బ్రతికే ఉన్నావ?" అనుచు ప్రశ్నించినటుల్
మతి దోచును! సతి వీడిన
పతి జీవన్మృతుడు శుష్కవాక్యము రీతిన్!

ఇచట నావంటి వార లనేకమంది
యంత్ర జీవితమనెడి బకాసురునకు
కన్నబిడ్డల బలిజేసి ఖిన్నులగుచు
మూగమనసుల రోదించు ముసలివారు!

ఆదివారము అనుమతింతురు అతిథి జనులను లోనికిన్
ఎదురు జూతురు, ఎదురు జూతురు, ఎదురు జూతురు ఆశతో!
చెదరిపోవును ఆశ కాటుక చీకటుల్ చెలరేగగా
ముదుమి మనసుల మరల మరలిటు మోసపుచ్చుట న్యాయమే?

కాటికి కాలుసాచియు నకారణ మీ మమకార బంధముల్
ఏటికి సెప్పు? కాని మనసే వినదాయెను, నాది నాదనున్!
పూటకి పూట కష్టమయి పోయెను లోకపు చీకటింట యీ
నాటక, మింక చాలు, తుది నా గది తల్పులు తట్టుటెన్నడో?

నిన్ను చేరు వేళ యెన్నాళ్ళ కెన్నాళ్ళ
కనుచు, కనుచు నుంటి కాలుని దెస
క్షణము యుగములైన కాలమ్ము సాగదు
మరణమునకునైన కరుణ రాదు!

వెతలు వెళ్ళగ్రక్కి వేదన రగిలించ
వేడ్క కాదు, కాని వెఱ్ఱి మనసు
ఊరుకోదు! బాధ నోరార జెప్పగా
ఎవరు గలరు నాకు, నీవు తప్ప?

ఇప్పటికే నా బాధలు
చెప్పీ చెప్పీ మనస్సు చెడగొట్టితినా?
చప్పున నిక ముగియించక
తప్పదు...

మరి సెలవు,

                 

Saturday, 17 March 2012

ugaadi subhaakaankshalu....



         మామిడి కొమ్మల తోరణాలు....
              షడ్రుచుల మేళవింపు  లోని
                    తీపి ,పులుపు ,వగరు,ఉప్పు,
                        చేదు మరియు కారములు....
                           గత సంవత్సర జ్ఞాపకాల ఆనవాళ్ళు...
                              నూతన సంవత్సరానికై                             
                                 పంచాంగ శ్రవణాలు.....
                                    సర్వేజనాః సుఖినో భవంతు                                     
                                       అంటూ పెద్దలు పలికే
                                          ఉగాది  ప్రవచనాలు.....
                                              అందరికీ ఎల్లప్పుడు  వుండాలని
                                                  ఆశిద్దాం ఆ భగవంతుని ఆశీర్వచనాలు.......!!

Tuesday, 13 March 2012

my uncle n aunty...

   

        కోపం ఎరుగని వెన్నెల వంటి చిరునవ్వు  మీకే సొంతం....

          కల్లాకపటం ఎరుగని మీ ద్వయం పర్వతీపరమేశ్వరులను మరపించు ఆసాంతం ....
         
             తమరి సేవా తత్పరతకు ఆశ్రమ వాసులంతా ముగ్దులయ్యే ఆద్యంతం.......

                 తన మన భేధాలేరుగని మీ సాంగత్యం , మేమంతా మరువము జీవితాంతం.....!!












Tuesday, 14 February 2012


    అరుణుడు పచ్చని  పుడమిని ముద్దాడే  వేళ....


         ఆకాశాన  రేరాజు కోరే తన కావలికి  విశ్రాంతి జోల...
       
                అవని తన శీతల నిశ్సీది  కంబలి తొలగించే మరల...
     
                        అనంత విశ్వాన్ని స్ప్రుసిస్తూ అరుణ కిరణాలు చేసే ఆనంద హేల....**
            


          అరుణ వర్ణాన బాల భానుడు కన్యాకుమారిలో జననం...
             అనంత త్రిసాగర సంగమం కన్యకుమారియందు విలీనం...
                 అవనిని ఆకాశం ముద్దాడే కన్యాకుమారి సాక్షినం ....
                     అబ్బురపరిచే దేశ విదేశీయులను సైతం కన్యాకుమారీ నీ రూపం...
                          ఆలవాలమై చాటే సంస్కృతీ సంప్రదాయాలను కన్యాకుమారిన ఘనత కలిగిన మన భారతదేశం!

Sunday, 18 December 2011

neelo nenuu....

పున్నమి రాత్రి జాబిలిని చూడు .....ఆ వెలుగులో నేనుంటా ..!

వేకువ జామున సూర్యుని చూడు ...అరుణ వర్ణమై నేనుంటా..!

ఉరిమే మేఘపు వర్షం చూడు ....ఆ బిందువు అందం లో నేనుంటా...!

నీ గుండె తలుపు తట్టి చూడు ...ఆ హృదయ సవ్వడి లో నేనుంటా...!

ప్రతి క్షణం నీ నీడై ఉంటా .....అనుక్షణం నీ తోడుగా  నేనుంటా....!