..
madiki tochinadi...manasuki nachinadi.

Monday 3 April 2017

ఆధునిక #సమాజంలో_స్త్రీ

ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. ఇంటి సౌందర్యం ఇల్లాలి పనితీరు పైనే ఆధారపడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలను స్త్రీకి కట్టబెట్టింది ఆమెను ఇంట్లో కట్టిపడేయడానికి కాదు. కుటుంబ సంక్షేమం మొత్తం ఆమె చేతులకు ఇచ్చింది ఆమె ప్రజ్ఞను గమనించే.
భారతీయ ధర్మంలో స్త్రీని అగ్నితో పోల్చారు. అంటే అగ్ని ఎంత పవిత్రమైనదో స్త్రీ అంతే పవిత్ర మైనదని అర్థం. స్త్రీ దేవతలను పూజించే ఆచారం కేవలం భారతీయ సనాతన ధర్మానికి మాత్రమే సొంతం. స్త్రీలకు ఇంతటి గౌరవాన్నందించిన సనాతన భారతీయ ధర్మంలో జన్మించిన మనం ధన్యజీవులం.
ధర్మార్థ కామ మోక్షార్థి అయిన పురుషుడు వివాహమాడి తన భార్యతో కూడి యజ్ఞయాగాదులు చేసి పిత ఋణం, దేవ ఋణం, ఋషి ఋణాల నుండి ముక్తుడవుతాడు. పురుషునికి సంతాన భాగ్యాన్ని, విశేష గౌరవాన్ని, అమతత్వాన్ని ప్రసా దించేది భార్య మాత్రమే
కుటుంబ నిర్వహణలో ఆమె ఎన్నో పాత్రలు పోషిస్తుంది. శుచి, శుభ్రత, వంట తయారీ ఇంట్లో స్త్రీ బాధ్యత. అంటే ఇవన్నీ ఆమె పాటించి, కుటుంబ సభ్యులకు నేర్పడం ద్వారా ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఆమె ఒక వైద్యురాలు. పిల్లలకు విద్యా బుద్ధులునేర్పి మంచి గుణాలు, నడవడిక అలవాటు చేసి, సమాజానికి ఉపయోగపడే విధంగా పిల్లలను తయారు చేయడం ద్వారా ఆమె ఒక గురువు స్థానాన్ని పొందుతుంది. భర్తకు అనుగుణంగా నడచుకొని, ఆజ్ఞలు పాటించి, చెడుదారులు పట్టకుండా, జీవితంలో కావలసిన చోట మంచి సలహాలు చెప్పి, కుటుంబ గౌరవం నిలిపే వేళ ఆమె ఒక మంత్రి. ఇంటికి వచ్చే అతిథులను, బంధువులను, కుటుంబ సభ్యులను గౌరవించి, ఆదరించే వేళ ఆమె అన్నపూర్ణ. మన భారత కుటుంబంలో సంపాదించే బాధ్యత మగవారికి, దానిని ఖర్చుపెట్టే బాధ్యత స్త్రీకి ఉంటుంది. వచ్చిన సంపాద నలో కొంత మిగులు చేసి, మిగిలిన దానిని సక్రమంగా వినియోగించే వేళ ఆమె ఒక ఆర్థికవేత్త.

భర్త సంపాదన ఇంటి అవసరాలకు సరిపోని సమయంలో ఇల్లు నడవడానికి ఆమె కూడా కష్టపడి సంపాదించగల ధైర్యవంతురాలు స్త్రీ. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగల నిబ్బరం స్త్రీకి ఉంటుంది. ఓర్పు, సహనానికి ప్రతీక స్త్రీ. కుటుంబ సభ్యులందరి అవసరాలు తీరుస్తూ, ఆమె ముందుకు సాగుతుంది. కుటుంబంలోని ఆటుపోట్లను, జీవితం లోని కష్టాలను ఓర్పుతో, సహనంతో భరిస్తూ కుటుంబానికి ఆనందం కలిగించేందుకు ఆమె ఎప్పుడూ తపిస్తుంది. ఒక కుటుంబం అభివద్ధి పథంలో ముందుకు సాగుతుందంటే అది కేవలం స్త్రీ గొప్పతనం మాత్రమే. భార్యగా, అత్తగా, కుమార్తెగా, అక్కగా, చెల్లిగా, నాయనమ్మగా స్త్రీ కుటుంబంలో అనేక పాత్రలు పోషిస్తుంది.

కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలలో ఆమెదే ప్రధాన పాత్ర. ఆమె చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట కుటుంబం మీద ప్రభావం చూపుతాయి. ఆమె పాత్ర వల్ల కుటుంబంలో సంతోషం తాండవిస్తుంది. ఒక కుటుంబం లేదా పిల్లలు బాగుపడినా లేదా చెడిపోయినా దానికి బాధ్యురాలు స్త్రీయే. స్త్రీ శారీరిక శక్తిలో పురుషునికన్నా బలహీను రాలు అయినప్పటికీ, మానసిక శక్తిలో ఆమెకు ఎవరూ సాటిలేరు. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ ధర్మంలో స్త్రీయే ఇంటికి యజమానురాలు.
ఆధునిక సమాజంలో స్త్రీ పాత్ర మరెంతో పెరిగింది. స్త్రీలు ఒకవైపు ఉద్యోగ బాధ్యతలను నెరవేరుస్తూ, మరోవైపు కుటుంబాన్ని చూసుకుంటూ, కుటుంబ అభివద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. గ్రామం, పట్టణం ప్రాంతం ఏదైనా కావచ్చు; ఉన్నత, మధ్య, పేద తరగతి వర్గం ఏదైనా కావచ్చు; కులం, మతం, ఏదైనా కావచ్చు అన్ని చోట్ల కుటుంబాలలో స్త్రీ మూర్తే కీలక పాత్రధారి. పేరుకి భారతీయ కుటుంబాలు పురుషస్వామ్య కుటుంబాలు అయి నప్పటికీ, కుటుంబ చక్రం ముందుకు సాగటానికి ఆ కుటుంబాలలో స్త్రీల పాత్రే ప్రధాన కారణం. ప్రపంచమంతా భారతీయ కుటుంబ వ్యవస్థను వేనోళ్ళ కీర్తిస్తుందంటే ఆ గొప్పతనం మన మాతృ మూర్తులకే చెందుతుంది. అంతేకాకుండా నేడు అనేక రంగాలలో మహిళా శక్తి ముందుంటున్నది. కానీ నాగరికత పెరిగి సమాజం ముందుకు పోతున్న ఈ రోజులలో, స్త్రీలపై అత్యాచారాలు, అకత్యాలు జరుగుతున్నాయి. ఇదొక దురదృష్టకర పరిస్థితి. దీనిని కూడా ఈ సమాజం అధిగమిస్తుందని ఆశిద్దాం.