..
madiki tochinadi...manasuki nachinadi.

Monday 6 March 2017

నాగరికత నేర్పిన నవీనలు..🙏🏻

*Dedicated to All the Mothers*

*మరోదార్లేదు... మాతృస్వామ్యమే!*


తవ్వేకొద్దీ కళాఖండాలే!
అందమైన శిల్పాలూ...
అపురూప చిత్రాలూ...
ముచ్చటగొలిపే గృహోపకరణాలూ... అలికి ముగ్గేసినట్టున్న లిపీ...
ఒక్కొక్కటే బయటపడుతున్నాయి.
‘సందేహం లేదు. ఈ నాగరికతకు మహిళే ఆద్యురాలు. ఇది మాతృస్వామ్య వ్యవస్థే’ - ఆ అపురూప సంపద వైపు అబ్బురంగా చూస్తూ అధికారికంగా ప్రకటించాడు పురావస్తు నిపుణుడు.
‘అంత కచ్చితంగా ఎలా చెప్పగలరు?’ ప్రశ్నించారు విలేకరులు.
‘గమనించారా, తవ్వకాల్లో చిన్న ఆయుధమైనా బయటపడలేదు. యుద్ధాలు జరిగిన ఆనవాళ్లూ లేవు. ఎటు చూసినా కళాసృష్టే. మహిళల నేతృత్వంలోని సమాజంలోనే కళలకు ఇంత విలువ ఉంటుంది. కళలున్నచోటే శాంతి నెలకొంటుంది. రణాలకూ రక్తపాతాలకూ ఆస్కారం ఉండదు. ఇంతకు మించిన ఆధారాలేం కావాలి?’
- ఆ వాదనకు తిరుగులేదు.

* * *

మహిళ నేతృత్వంలోని పాలన వ్యవస్థ - మాతృస్వామ్యం. అది కుటుంబం కావచ్చు, రాజ్యమూ కావచ్చు. ఓ సంస్థో బృందమో అయినా కావచ్చు. దీన్నే ‘సహజ’స్వామ్యమనీ అంటారు సామాజికవేత్తలు. సహజం అంటే ప్రకృతి సిద్ధమైంది. ఆదిలో, ప్రకృతే ఆమెకు ఆ పట్టం కట్టింది.
నాగరికతకు - పురుషుడు బీజం అయితే, స్త్రీ క్షేత్రం.
ఎప్పుడూ... విత్తు కంటే చేనే విలువైంది.

బంధానికి మూలం కుటుంబం. కుటుంబానికి ప్రాణం మహిళ. పురుషుడికి సంబంధించినంత వరకూ, ‘నా’ అన్న భావన ఓ నమ్మకం. పితృత్వం ఎప్పుడూ పరోక్షమైన అనుభూతే. స్త్రీ విషయంలో అలా ఉండదు. మాతృత్వాన్ని ఆమె నేరుగా అనుభవిస్తుంది. ఆ అనుభూతి కోసం ఆరాటపడుతుంది. అంతులేని ప్రసవవేదనను అనుభవిస్తుంది. తాను భూమాతగా మారిపోయి, గడ్డిపోచలాంటి కొత్త జీవికి ప్రాణంపోస్తుంది. కాబట్టే, ‘కుటుంబం’ అన్న ఆలోచన, మగవాడి కంటే ముందు ఆమెకే వచ్చుంటుంది. అభంశుభం తెలియని సంతానాన్ని... విషసర్పాల నుంచీ క్రూరమృగాల నుంచీ రక్షించుకోడానికి కొండలూ కోనలూ గాలించి ఉంటుంది. వెదికీ వెదికీ వెచ్చని గుహను గృహంగా ఎంచుకుని ఉంటుంది. అలా, సంచార జీవితాలకు అలవాటుపడిన ఆదిమజాతుల్ని స్థిర నివాసాల వైపు మళ్లించడం - ఆమె తొలి విజయం! నివాసం దొరికింది, ఇక వికాసం కావాలి. ఆ శక్తి కళలకే ఉంది. చీకటి రాత్రుల్లో చిన్న పిల్లల్ని నిద్రపుచ్చడానికి ఏ పక్షుల కూతల్నో అనుకరిస్తూ సంగీతాన్ని సృష్టించి ఉంటుంది. జతగాడిలో జీవనోత్సాహాన్ని నింపడానికి నృత్యరీతుల్ని అల్లుకుని ఉంటుంది. అల్లరి పిల్లలకు అనగనగా కథలు చెప్పడానికి రాతిగోడల మీద రంగుల బొమ్మలేసి చిత్రకళకు రూపమిచ్చి ఉంటుంది. ఏది మంచో ఏది చెడో, ఏది విషకీటకమో ఏది సాధుజీవో బిడ్డల్ని హెచ్చరించే ఆరాటంలో భాషకు వూపిరిపోసి ఉంటుంది. ఎవరి బతుకు వాళ్లు బతకడం ఏమాత్రం కష్టం కాదు. నాలుగు కడుపులు నింపాల్సి వచ్చినప్పుడే, సాంకేతికత కావాలి. అవసరం అమ్మదే కాబట్టి, ఆవిష్కరణ కూడా అమ్మదే అయ్యింది. మేధకు పదునుపెట్టి లోహాల్ని గుర్తించినా, ఆ లోహాలను అరగదీసి ఆయుధాల్ని కనిపెట్టినా... అదంతా మాతృత్వపు తపనతోనే! ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది. భయాన్ని గెలవడానికి ఏదో ఓ బలమైన ‘విశ్వాసం’ కావాలి. ఆ కడుపు తీపితోనే...‘తల్లీ! నా సంతతిని చల్లగా చూడు’ అంటూ కనిపించని ప్రకృతిశక్తిని వేడుకుని ఉంటుంది. అలా, స్వహస్తాలతో ఆధ్యాత్మికతకు బీజంవేసి ఉంటుంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ ముమ్మూర్తులా మాతృస్వామ్య అధిదేవతే. ‘ఇదంతా జరుగుతున్న సమయానికి మగాడేం చేస్తున్నట్టు?’ అన్న ప్రశ్నకు జవాబు వూహించడం పెద్ద కష్టమేం కాదు. ఈ ప్రక్రియలో అతడిది అతిథి పాత్రే. మహా అయితే, ప్రకృతి రెచ్చగొట్టినప్పుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చే ప్రవాసి పాత్ర. పురుషుడిలో స్వార్థం పెరిగేకొద్దీ మాతృస్వామ్యానికి బీటలు పెరిగాయి. మగాడు ఆమె ప్రేమను బలహీనతగా భావించాడు. ఆమె సౌకుమార్యాన్ని అశక్తత కింద లెక్కేశాడు. నిజానికి, చరిత్రను చూసే పద్ధతీ, రాసే పద్ధతీ పూర్తిగా మారిపోవాలి. మానవ పరిణామ చరిత్రనంతా మహిళ కోణంలోంచి పునర్నిర్మించాలి. హరప్పా, మొహంజొదారో సహా ప్రపంచ ప్రసిద్ధ నాగరికతలన్నీ మాతృస్వామ్య వ్యవస్థలుగానే మొదలై... క్రమంగా పురుషాధిపత్యానికి తలవంచి... చివరికి ఆ పురుషుడి నిరంకుశత్వం కారణంగానే కనుమరుగైపోయాయి. సరిగ్గా, అలాంటి చారిత్రక తప్పిదాన్నే మళ్లీ ఇప్పుడు చేస్తున్నామా?

అదే పరిష్కారం...
ఆడపిల్ల పుట్టిందని తెలియగానే మిఠాయిలు పంచుకునే సంస్కారం, భార్యవేలు పట్టుకుని భర్త ఒద్దికగా నడిచే అపురూప దృశ్యం...నాగరిక సమాజాల్లో కనిపించకపోవచ్చు. కానీ, అనాగరికులుగా ముద్రపడిన ఆటవిక తెగల్లో దర్శనమిస్తుంది. ఆ సమాచారం తెలియగానే, బెర్లిన్‌ ఫొటోగ్రాఫర్‌ కరొలిన్‌ మెడలో కెమెరా వేసుకుని ప్రపంచయాత్రకు బయల్దేరింది. ఫొటోగ్రఫీలో ప్రయోగాలు చేయడం ఆమెకిష్టం. ఆత్మవిశ్వాసం తొణికిసలాడే మహిళల మొహాల్ని తన కెమెరాలో బంధించాలన్న తపనతో నలుమూలలా ప్రయాణించింది. భారతదేశానికి కూడా వచ్చింది. ఎవరో సలహా ఇస్తే, మేఘాలయలో ఖాసీ తెగ ఉంటున్న గూడేలకు వెళ్లింది. అక్కడి ఆదివాసులు తరాలుగా మాతృస్వామ్యాన్ని అనుసరిస్తున్నారు. ఓ పది రోజులు వారిమధ్యే గడిపింది. చాలా ఫొటోలు తీసుకుంది. ‘ఇంత ఆత్మవిశ్వాసమున్న మహిళలు ఎక్కడా కనపడలేదు. దేశాధ్యక్షుల్ని చూశాను, కార్పొరేట్‌ నారీమణుల్ని కలిశాను. విశ్వసంపన్నుల్నీ లెన్స్‌లోంచి గమనించాను. జీవితాన్ని ఇంతగా ప్రేమించేవాళ్లూ, స్వేచ్ఛకు ఇంతగా ప్రాణమిచ్చేవాళ్లూ ఏ మూలనా తారసపడలేదు’ అని తీర్మానించింది. ఆ మహిళల్లో ఆత్మవిశ్వాసానికి కారణమేమిటో తెలుసుకుంటే, ఆధునిక సమాజంలోని మహిళల సమస్యలకూ సంక్షోభాలకూ పరిష్కారం దొరికిపోతుంది.
ఖాసీలే కాదు... నవనాగరికత ఛాయలు సోకని, అనేకానేక ఆదిమజాతులు మాతృస్వామ్య వ్యవస్థనే అనుసరిస్తున్నాయి. ఆమె మాటను శాసనంగా శిరసావహిస్తున్నాయి. అందులో, చాలా తెగలకు లిఖిత భాషంటూ లేదు. పాడుకునే పాటలూ, చెప్పుకునే కథలే చరిత్రలు. మాతృపాలన క్రమక్రమంగా మైదానప్రాంతాల్లో కనుమరుగైనా, పచ్చని అడవుల్లో అచ్చమైన మనుషుల మధ్య ఇంకా బతికే ఉంది. అసలు, ఆ సమాజాలు ఎలా పనిచేస్తున్నాయి? అక్కడి ప్రజలు ఎంత తృప్తిగా, ఎంత సంతోషంగా ఉన్నారు, నిజంగానే మహిళకు ఓ జాతిని నడిపించే సత్తా ఉందా?... అన్న కోణంలోంచి విస్తృతమైన అధ్యయనాలు జరుగుతున్నాయి.. ‘మాతృస్వామ్యం అంటే... మహిళాధిక్య సమాజమని అనుకుంటే పొరపాటే. ఆ నాయకత్వంలో సమభావన అంతర్లీనం’ అంటారు, మాతృస్వామ్య వ్యవస్థల్ని లోతుగా అధ్యయనం చేసిన టెక్సాస్‌ యూనివర్సిటీ నిపుణుడు గోట్నెర్‌ అబెండ్రోత్‌. పితృస్వామ్య సమాజంలో మహిళ స్థానం అట్టడుగునే. ఆమెకు తీవ్ర వివక్ష ఎదురవుతూ ఉంటుంది. మాతృస్వామ్యంలో అలా కాదు. పురుషుడికెప్పుడూ తగిన గౌరవం ఉంటుంది. కండబలం, గుండెధైర్యం అవసరమైన విభాగాలన్నీ అతడికే అప్పగించేస్తుంది. ఆలనా పాలనా మాత్రం తన చేతిలో ఉంచుకుంటుంది. తల్లి ఇంటిపేరే పిల్లల పేర్ల చివరన చేరుతుంది. ఆస్తిపాస్తులకు అమ్మాయిలే అసలు వారసులు. పురుషుడికి ఆస్తి హక్కు ఉండదు. అయినా సరే... తాను వివక్షకో, వేధింపులకో గురవుతున్న భావన అతడిలో ఏ కోశానా కనిపించదు. అభద్రతతోనే అలాంటి మానసిక జాడ్యాలు వస్తాయి. మహిళ ఆ దుస్థితి ఎప్పుడూ కల్పించదు. ఆ సమాజాల్లో అప్పుల బాధలు ఉండవు. మగవాడిలో మద్యం లాంటి వ్యసనాలూ నామమాత్రమే. టిబెట్‌ సరిహద్దుల్లోని మొసూవో, ఇండొనేషియాలోని మినంకబు, ఘనాలోని అకన్‌, కోస్టారికాలోని బ్రిబ్రి - ఇలా ఏ వ్యవస్థను తీసుకున్నా పురుషాధిపత్య సమాజాలతో పోలిస్తే, ఇక్కడే పురుషులు సంతోషంగా ఉన్నారు. మహిళలైతే ఆనందానికీ ఆత్మవిశ్వాసానికీ ప్రతీకలుగా కనిపిస్తారు. మగవాడు పట్టువిడుపులు పాటించి... మాతృస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించుకోగలిగితే, మానవ వికాస చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైనట్టే. అందుకు, చట్టాల్ని సవరించాల్సిన పన్లేదు. రాజ్యాంగాన్ని తిరగరాసుకోవాల్సిన అవసరం లేదు. ‘మైండ్‌సెట్‌’ను మార్చుకుంటే సరిపోతుంది.

కొత్తదారి...
వేల సంవత్సరాల నుంచీ కుటుంబాన్ని పాలిస్తున్నాడు, ప్రపంచాన్ని ఏలేస్తున్నాడు. అయినా, మగవాడు సాధించిందేముందీ? అమ్మకడుపులోని ఆడపిల్ల, సురక్షితంగా నేలమీద పడుతుందన్న భరోసా లేదు. పడినా...పెరిగిపెద్దవుతున్నకొద్దీ శత్రువులే! చుట్టూ ఆకలిచూపులూ అనుమానపు దృక్కులూ! బూచాడు బంధువు రూపంలో ఇంట్లోనే ఉండవచ్చు, రాబందై ప్రపంచంలోని ఏ మూల నుంచైనా సైబర్‌ దాడికి దిగవచ్చు. అడుగడుగు గండాల్ని అధిగమించుకుంటూ... ఉద్యోగం సాధించుకున్నా, వ్యాపారం ప్రారంభించుకున్నా ప్రతిభే కొలమానం అవుతుందనడానికి వీల్లేదు. బతుకునిండా బాధలే. అడుగడుగునా గండాలే. గత పదేళ్లలో కోటి భ్రూణహత్యలు జరిగినట్టు అంచనా. రెండుమూడేళ్లలోనే పాతికవేల వరకట్న హత్యలు నమోదైనట్టు సమాచారం. పదిహేనేళ్ల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్యనున్న మహిళల్లో డెబ్భైశాతం మంది ఏదో ఓ సమయంలో, ఏదో ఓ రూపంలో లైంగిక దోపిడి బాధితులే. లింగనిర్ధారణ పరీక్షలనేవి... వేయికోట్ల పరిశ్రమగా వర్ధిల్లుతున్నాయని సాక్షాత్తూ యునిసెఫ్‌ సంస్థే లెక్కతేల్చింది. స్త్రీపురుష నిష్పత్తిలోనూ తీవ్ర అగాథాలున్నాయి. ఇవన్నీ, పురుషాధిక్య సమాజం మెళ్లొ వేసుకుని వూరేగుతున్న పాపాల కపాలాలే!
మాతృస్వామ్యంలో ఈతరహా చీడల జాడలు మచ్చుకైనా కనిపించవు. ఆ గూడేల్లో కోడలో కూతురో గర్భం దాలిస్తే, ‘పండంటి ఆడబిడ్డను కను...’ అని మనసారా దీవిస్తారు. ఆడపిల్లే పుట్టాలని అమ్మతల్లికి దండం పెట్టుకుంటారు. అనుకున్నట్టు ఆడపిల్లే పుడితే సంబరంగా పండగ చేసుకుంటారు. అలా అని, అబ్బాయిపుడితే... తీసుకెళ్లి చెత్తకుండీల్లో పడేయరు, మురికి కాలువల్లో విసిరేయరు. అంత కుసంస్కారం వాళ్లకు లేదు! కాబట్టే, స్త్రీపురుష నిష్పత్తిలో ఆదిమజాతులు ఆధునిక సమాజానికి పాఠాలు నేర్పగలుగుతున్నాయి. అక్కడ, వందమంది పురుషులకు వందపైచిలుకు మహిళలు కనిపిస్తారు. ఆ సమాజాల్లో లైంగిక హింసకు తావే ఉండదు. భర్త భార్యను గౌరవిస్తాడు. ఆమె అడుగులకు మడుగులొత్తుతాడు. ఆమె మనసును అస్సలు నొప్పించడు. కారణం - ప్రేమ ఒక్కటే కాదు, ఆమె ఆర్థిక సాధికారత కూడా. ఇల్లాలు ఆర్థికంగా సర్వస్వతంత్రురాలన్న విషయాన్ని మరచిపోడు. ఆస్తిపాస్తులన్నీ అమ్మ నుంచి కూతురికీ, కూతురి నుంచి మనవరాలికీ - వారసత్వంగా సంక్రమిస్తాయి. కేరళలోని ట్రావన్‌కోర్‌ రాజవంశానికి చెందిన రాణీ గౌరీపార్వతీబాయి ఓ పుస్తకంలో మాతృస్వామ్య వ్యవస్థ జ్ఞాపకాల్ని పంచుకుంటూ... ‘భర్త భార్య మీద చెయ్యెత్తిన దాఖలాలు లేవు. అంత కర్కశంగా ప్రవర్తిస్తే, మొగుడని కూడా చూడకుండా నిర్మొహమాటంగా ఇంట్లోంచి గెంటేస్తారు. ఆలూమగల అనుబంధానికి మితిమీరిన పవిత్రతను అంటగట్టి....చచ్చినట్టు రాజీపడిపోవాల్సిందే అంటూ భావోద్వేగ బందూకులు గురిపెట్టడం ఆ అమాయకులకు తెలియదు’ అంటారు. మహిళ కూడా తనకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోదు. సాధ్యమైనంత వరకూ బంధాన్ని నిలుపుకునే ప్రయత్నమే చేస్తుంది. అయినా, విడిపోవడం తప్పదనుకుంటే... పంచాయతీలూ కోర్టులూ ఉండవు. కొన్ని తెగల్లో అయితే - భర్త చెప్పుల్నో, గొడుగునో తీసుకెళ్లి వీధిలో పడేసినా చాలు, పెళ్లి పెటాకులైనట్టే. ఆ ధైర్యానికి కారణం...ఆస్తిపాస్తులొక్కటే కాదు. అమ్మమ్మ-అమ్మ కుటుంబం నుంచి లభించే మద్దతు ఆమెను రాజీలేని నిర్ణయానికి ప్రోత్సహిస్తుంది. భర్తలేకపోతే మగదిక్కులేని సంసారం అవుతుందన్న భయం ఏ కోశానా కనిపించదు. సంతానం కోసం జీవితాన్ని త్యాగం చేసుకోవాల్సిన అగత్యమూ ఉండదు. అక్కచెల్లెళ్ల పిల్లల బాధ్యత ‘మేనమామ’ మీదే ఉంటుంది. ఇంత బలమైన మద్దతు వ్యవస్థ ఏ సమాజంలోనూ కనిపించదు. ఇందులో, పావువంతు భరోసా కూడా.... ఆధునిక మహిళకు అందడం లేదు. విధిలేని పరిస్థితుల్లో విడాకులకు సిద్ధపడితే, దాదాపుగా ఒంటరిపోరాటం చేయాల్సిందే. అంత్తింటికి పంపడంతోనే బాధ్యత తీరిపోయిందని కుండ బద్దలుకొట్టే కన్నవాళ్లు చాలామందే. బంధుమిత్రులైనా ఆ నిర్ణయాన్ని స్వాగతించరు. సతీసావిత్రి కథలు చెప్పి మనసుమార్చే ప్రయత్నం చేస్తారు. రాజీ అనివార్యమంటూ ఆ రాక్షసుడికి వంతపాడతారు.
ఏ మహిళకైనా
కలిసుండే స్వేచ్ఛ ఎంత ముఖ్యమో...
విడిపోయే స్వేచ్ఛా అంతే ముఖ్యం!

రేపటి రాజ్యం...
కాలానికి ఓ గొప్ప శక్తి ఉంది. ఏదో ఓ రూపంలో, ఏదో ఓ సమయంలో గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటుంది. సాధ్యమైనంత సాఫీగా, మహా అయితే ఓ చిన్న కుదుపుతో వ్యవస్థలో సర్దుబాటు తీసుకొస్తుంది. ఒకప్పుడు మాతృస్వామ్యం. ఆతర్వాత పితృస్వామ్యం. మళ్లీ ఇప్పుడు...మెల్లమెల్లగా మాతృస్వామ్యం వైపుగా అడుగులు. కొన్నిసార్లు తెలిసీ, కొన్నిసార్లు తెలియకుండానే! వివిధ విశ్వవిద్యాలయాలు పట్టా కాగితాల మీద తండ్రిపేరుతో పాటు తల్లిపేరునూ ముద్రిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు ఇంటిపట్టాల్ని గృహిణి పేరునే మంజూరు చేస్తున్నాయి. ఇవన్నీ మాతృస్వామ్య ఛాయలే. ఏ కుటుంబమైనా మహిళ నాయకత్వంలోనే సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం ప్రభుత్వాలకూ కలుగుతోంది. మధ్యప్రదేశ్‌ సర్కారు రేషన్‌ కార్డులను ఆ ఇంటి ఇల్లాలికే ఇస్తోంది. చాలామంది మగరాయుళ్లు రేషను సరుకుల్ని తీసుకెళ్లి, ఏ కొట్లోనో అమ్మేసుకుని...నేరుగా మద్యం దుకాణాలకు వెళ్లిపోయేవారు. రేషన్‌కార్డుల్నో, ఇంటి పత్రాల్నో తాకట్టుపెట్టి విలాసాలకు అప్పులు చేసేవారు. దీనివల్ల పేదలు పేదలుగానే మిగిలిపోతారు. సంక్షేమ పథకాలకు ప్రయోజనం లేకుండా పోతుంది. మాతృస్వామ్యాన్ని గుర్తించడం ద్వారా, ఇంటిపెద్దగా మహిళ పేరును అధికారికంగా నమోదు చేయడం ద్వారా... ఓ వ్యవస్థాపరమైన లోపాన్ని సవరించుకుంటున్నారు పాలకులు. ఆహారభద్రత చట్టం కూడా మహిళనే కుటుంబ యజమానిగా గుర్తించింది. ఈ నిర్ణయాలన్నీ పరోక్షంగా మహిళాస్వామ్యాన్ని ఆమోదించడమే.

కార్పొరేట్‌ మాతృస్వామ్యం...
కార్పొరేట్‌ పరివారాల్లోనూ మాతృస్వామ్యమే బలపడుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు - చందాకొచ్చర్‌, ఎస్‌బీఐ - అరుంధతీ భట్టాచార్య, యాక్సిస్‌ బ్యాంక్‌ - శిఖాశర్మ, బ్రిటానియా - వినితాబాలి ... మాతృమూర్తులు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంస్థల మార్కెట్‌ విలువ - మొత్తంగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగలిగేంత! కొన్ని లక్షలమంది ఉద్యోగుల జీవితాల్నీ, అంతకు వందరెట్ల ఖాతాదారుల ఆర్థిక వ్యవహారాల్నీ ఒక్క సంతకంతో మార్చేయగల ధీమంతులు కార్పొరేట్‌ అమ్మలు. ఆయా యాజమాన్యాలు కాకలుతీరిన పురుషుల్ని పక్కనపెట్టి, మహిళలకే పెద్దపీట వేయడాన్ని యాదృచ్ఛికమనీ అనుకోలేం. దీనివెనకో పక్కా వ్యాపార వ్యూహం ఉంది. కర్రపెత్తనాలకు కాలం చెల్లిపోయింది. కళ్లెర్రజేయగానే భయపడిపోడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కఠినంగా చెప్పినా కమ్మగానే చెప్పాలి. నొప్పించకుండా ఒప్పించాలి. నాలుగు అభిప్రాయాలు తెలుసుకోవాలి. నలభై ఆలోచనల్ని సమన్వయం చేసుకోవాలి. ఆ నైపుణ్యం మగవాడితో పోలిస్తే, మగువలోనే అధికం. అందులోనూ సంక్షోభ సమయాల్లో ఆమె...మహా నిబ్బరంగా, ఎంతో పరిణతితో వ్యవహరిస్తుంది. ఆదిమయుగాల్లో ఒంటరితల్లి బిడ్డల్ని కాపాడుకునేందుకు పడిన ఆరాటాన్నే, సంస్థను నిలబెట్టుకోవడంలోనూ ప్రదర్శిస్తుంది. ఆమె చందాకొచ్చర్‌ కావచ్చూ, అరుంధతీ భట్టాచార్య కావచ్చూ - అందర్లోనూ ఓ సారూప్యం ఉంది. వాళ్లెవరూ పురుషుడిలా నటించే ప్రయత్నం చేయరు. స్త్రీసహజ స్వభావాల్ని దాచుకోరు. స్త్రీత్వంలో భాగమైన ప్రేమనూ, ఓర్పునూ, నేర్పునూ రంగరించి తమవైన మేనేజ్‌మెంట్‌ సూత్రాలు రచించుకుంటున్నారు. అంతర్జాతీయంగా మహిళల నాయకత్వంలోని డెబ్భైశాతం కంపెనీలు - రుణరహిత సంస్థలే. అప్పులంటే ఆమెకు అస్సలు పడదు - అది ఇంట్లో అయినా, వ్యాపారంలో అయినా. అందుకే, మాతృస్వామ్య కార్పొరేట్‌ సూత్రాల మీద నడుస్తున్న ఏ కంపెనీలోనూ ఆడంబరాలకు తావుండదు. ఏటా, లక్షలు ఖర్చుపెట్టి ఉన్నతోద్యోగుల్ని విదేశాలకు తీసుకెళ్లే ఓ కంపెనీ, తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. మహా అయితే ఓ స్టార్‌హోటల్‌లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించి, మిగతా సొమ్మును సిబ్బంది కుటుంబానికి బోనస్‌గా ఇస్తోంది. పురుషస్వామ్యంలో ఈతరహా నిరాడంబరత్వాన్ని వూహించలేం. క్రెడిట్‌ స్యూయిజ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక ప్రకారం... మిగతావాటితో పోలిస్తే, బోర్డులో మహిళలకు ప్రాధాన్యం ఉన్న కంపెనీలు లాభదాయకంగా నడుస్తున్నాయి.
పురుషాధిక్య సమాజానికి సమాంతరంగా... మహిళ చేత, మహిళ కోసం మహిళలే ఏర్పాటు చేసుకుంటున్న ఆధునిక వ్యవస్థలూ చాలానే ఉన్నాయి. అలాంటి ‘ప్రమీల రాజ్యాలు’ కార్పొరేట్‌ ఆవరణల్లోనూ వెలుస్తున్నాయి. ‘మహిళలకు మాత్రమే...’ బోర్డు పెట్టుకున్న కంపెనీలూ, ‘నో బాయ్స్‌ అలౌడ్‌...’ అని షరతు విధిస్తున్న ‘విమెన్‌ ఓన్లీ’ కోవర్కింగ్‌ స్టేషన్లూ అక్కడక్కడా వెలుస్తున్నాయి. దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇవెన్‌ కార్గో’ సంస్థలో అయితే అందరూ మహిళా ఉద్యోగులే. ప్రయాణాలంటే ఇష్టపడే మహిళల కోసం ‘షి-ట్రావెల్‌’ గ్రూపులూ పుట్టుకొస్తున్నాయి. ఈ వ్యవస్థలన్నీ పురుషాధిపత్యానికి సవాలే! ‘ఓ మగాడా, మగవాడా, మొగుడా! నువ్వు లేక నేను లేనన్న - మిడిసిపాటును తగ్గించుకో. నువ్వు లేకపోయినా మేం ఉన్నాం, సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. అవసరం అనుకుంటే ఏ కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారానో తల్లులమూ అవుతున్నాం’ అంటూ ఆ కోరమీసాలవాడి మీదికి సుతిమెత్తగా కత్తిదూసే కార్యక్రమాలే ఇవన్నీ. ఇదంతా పురుషద్వేషం కాదు, తరాల అణచివేత నుంచి బయటపడుతున్న సమయంలో...ఉప్పొంగుతున్న ఆత్మవిశ్వాస స్వరం.
‘నయానో భయానో....
పుచ్చుకోవడం మాత్రమే తెలిసిన పురుషుడా!
ఆమె నుంచి లాక్కున్న తాళాలగుత్తి ఆమెకే ఇచ్చెయ్‌.
కాదుపొమ్మంటావా....
ఇవ్వడం మాత్రమే తెలిసిన ఆ మహిళ
తిరగబడో, తెగబడో
తన ఏలుబడిని సాధించుకుంటుంది.
ఆమెకు ప్రేమించడం తెలుసు. పోరాడటమూ తెలుసు’

పురాణాల్లో...

మహాభారత కాలంలో కొంతమేర మాతృస్వామ్యం ఉండేదంటారు సామాజికవేత్తలు. కాకపోతే అప్పటికే ఆ వ్యవస్థ చివరి దశలో ఉంది. ప్రమీలార్జునీయ ఘట్టం... అందుకో ఉదాహరణ. కురుక్షేత్ర యుద్ధం తర్వాత, పాండవులు అశ్వమేధయాగం చేస్తారు. అర్జునుడు యాగాశ్వంతో బయల్దేరతాడు. ఆ గుర్రం స్త్రీమండలమైన ప్రమీల రాజ్యానికి చేరుతుంది. అది పురుషుల్లేని రాజ్యమని అంటున్నా, పురుషుడికి ఓ ఉనికంటూ లేని చోటుగా భావించాల్సి ఉంటుంది. ప్రమీల మీద అర్జునుడి విజయం, పెళ్లి....అంతిమంగా పురుషాధిపత్యానికి ప్రతీక. భీమసేనుడి భార్య హిడింబి కూడా ఒకానొక మాతృస్వామ్య వ్యవస్థకు చెందిన మహిళే.

చరిత్రలో...

మాతృస్వామ్యం ద్రవిడ సంప్రదాయమనీ, పితృస్వామ్యం ఆర్య సంప్రదాయమనీ ఓ వాదన. ఆర్యుల రాకతోనే...మాతృస్వామ్య పునాదులు కూలిపోయాయని ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేవారి మాట. శాతవాహన వంశంలో గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్టీపుత్ర పులోమావి మాత్రమే మాతృనామాల్ని ధరించారు. అదే వంశానికి చెందిన మరో సుప్రసిద్ధ పాలకుడు హాలుడు తల్లిపేరును చేర్చుకున్న దాఖలాల్లేవు. కేరళలోని ట్రావన్‌కోర్‌ రాజవంశం ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో... ఎనిమిదిమంది బాలికల్ని దత్తత తీసుకుంది. కారణం ఒక్కటే .. మహిళా వారసత్వాన్ని కొనసాగించడం.

ఆమెకే సాధ్యం!
డాక్టర్‌ టి.సుబ్రహ్మణ్యం నాయుడు
డైరెక్టర్‌, పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం
అధిపతి, ఆంత్రోపాలజీ విభాగం

ఓ పరిశోధకుడిగా నేను అనేక ఆదిమ జాతుల్ని చూశాను. మాతృస్వామ్య వ్యవస్థను అనుసరిస్తున్న తెగల్లోని క్రమశిక్షణా, అనుబంధాలూ ఇంకెక్కడా కనిపించలేదు. మణిపూర్‌, త్రిపుర లాంటి ఈశాన్యరాష్ట్రాలు చక్కని అభివృద్ధిని సాధిస్తున్నాయంటే, అందుకు కారణం మాతృస్వామ్యమే. అక్కడ, మహిళ నాయకత్వంలో ప్రతి కుటుంబమూ ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో నడుచుకుంటుంది. ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు మాతృత్వ సమాజంలోనే పరిష్కారం ఉందని నేను నమ్ముతున్నా. నా పరిశోధన ఫలితాలే ఆ విశ్వాసాన్ని కలిగించాయి. ముఖ్యంగా... వ్యసనాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న యువతరాన్ని అమ్మ నాయకత్వమే దార్లో పెట్టగలదు. కాకపోతే, ఆ బాధ్యతాయుత అధికారాన్ని నాన్నే ఆమెకు కట్టబెట్టాలి.🙏🏻