..
madiki tochinadi...manasuki nachinadi.

Sunday 29 December 2019

Surya Online News website
MAIN MENU.

*సిగ్గులేని సమాజమిది!*


*రాజధాని మార్పుపై స్పందన లేని ఆంధ్రా జనం*

తెలంగాణను చూసి నేర్చుకోని ఆంధ్రా సమాజం

*_కులం, స్వార్ధమే ఆంధ్రాకు శాపం_*

‘మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది

పదండి ముందుకు.. పదండి త్రోసుకు

పోదాం పోదాం పైపైకి!

కదం త్రొక్కుతూ, పదం పాడుతూ

హృదరాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం.

ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన సోమరులారా చావండి.

నెత్తురుమండే, శక్తులు నిండే సైకికులారా రారండి’

- ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా కేంద్రం గుర్తించి, ప్రధాని స్వయంగా శంకుస్థాపనకు హాజరయిన అమరావతి నగర రాజధానిని విశాఖకు తరలిస్తామన్న.. కొత్త ఏలికల ప్రకటన తర్వాత కూడా చేవచచ్చిన ఆంధ్రా సమాజానికి, చైతన్య రహితమైన ఆంధ్రా ప్రజలకు మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ కవిత నూటికి రెండొందల శాతం సరిపోతుంది. అవును.. ఇది నిజం.

‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని

అగ్గితోటి కడుగు, ఈ సమాజ జీవచ్ఛవాన్ని!

మారదు లోకం, మారదు కాలం

దేవుడు దిగిరాని, ఎవరు ఏమైపోనీ

మారదు లోకం మారదు కాలం!

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి?

గొర్రెతాటుమందకి నీ జ్ఞాన బోధ దేనికి?

ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం?

ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం?

*ఆధునిక మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆర్తి, ఆవేదనతో రాసిన ఈ గేయం ఇప్పుడు అమరావతి ప్రజలకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గాయంగా మారిన వైనానికి సాక్ష్యంగా నిలిచింది.*

అవును.. నిజం! ఆంధ్ర సమాజం సిగ్గులేని సమాజంగా దేశ ప్రజల ముందు సిగ్గుతో నగ్నంగా నిలుచున్న నిజమిది. ప్రత్యేక రాష్ర్టాన్ని పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల పోరాటపటిమ, చిత్తశుద్ధి, అంకితభావం, ఆగ్రహజ్వాలతో పోలిస్తే ఆంధ్ర సమాజ పౌరుషం పిపీలీకమే! దశాబ్దాల నాటి తెలంగాణ రాష్ట్ర కాంక్షను పోరగాడి నుంచి కురువృద్ధుడి వరకూ రోడ్డెక్కి సాధిస్తే.. వచ్చిన రాజధాని నగరాన్ని మరో ప్రాంతానికి తరలిస్తున్నా అడ్డుకోలేక, చేవచచ్చి, చేష్టలుడిగిన ఆంధ్రా సమాజ పిరికితనం, పలాయనత్వం, వెన్నులేని వీరత్వానికి ఏం పేరు పెట్టాలి? *_రాష్ట్ర ప్రయోజనాల కోణంలో కాకుండా.. పీల్చే గాలి, వదిలే గాలిని కూడా కులం కోణంలో ఆలోచించి, నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్షని, ఎవరి స్వార్ధం వారు చూసుకునే ఆంధ్రా సమాజ స్వార్ధానికి ఏ బిరుదునివ్వాలి?_*

*మూడు రాజధానుల పేరుతో పాలకులాడుతున్న రాజకీయ క్రీడను, కనీసస్ధాయిలో ఎదుర్కోని పిరికి సమాజానికి ఏం పేరు పెట్టాలి?*

‘తెలంగాణ ప్రజల మాదిరిగా పోరాడకుండా వచ్చిన రాష్ట్ర రాజధానిని కాపాడుకోలేని గుంటూరు-కృష్ణా జిల్లా ప్రజల చైతన్యరహిత పరిస్థితి చూస్తే జాలివేస్తోంది. ఒక రాజధాని నగరాన్ని తరలిపోకుండా అడ్డుకునే చైతన్యం ఈ ప్రజల్లో లేకపోవడం బాధాకరం. అమరావతిని అయోధ్యలా నిర్మించుకోవాలి’ - చైతన్యరహితులైన రాష్ట్ర ప్రజల నిస్తేజాన్ని ఆవేదనతో వివరించిన భువనేశ్వరి పీఠాథిపతి కమలానంద భారతి స్వామి మాటలొక్కటి చాలు. ఆంధ్రా సమాజం స్వార్ధంతో ఎంత బిజీగా ఉందో చెప్పడానికి!

రాజధానిని తరలించవద్దంటూ రోడెక్కిన 29 గ్రామాలకేనా ఆంధ్రుల ఆత్మాభిమానం? 30వ గ్రామంలో, మిగిలిన జిల్లాల్లో ఏమైందీ ఆ ఆత్మాభిమానం? ఎవరిని చూసి భయపడి దుప్పటి ముసుగేసుకుంది? ఎవరిని చూసి పంచె, ప్యాంట్లు తడుచుకుంటోంది? కోరకుండానే వచ్చిన రాజధాని తరలిపోకుండా, కాపాడుకునేంత సత్తువ ఆంధ్రా సమాజానికి చచ్చిపోయిందా?
*చచ్చు పుచ్చు వాదనలు, మతిలేని తర్కాలు, అంతులేని అతి తెలివి, పక్కవాడిని ముంచి తన జేబు నిండాలనుకునే అతి తెలివి, నరనరాన మోసం, వెన్నుపోట్లకు అలవాటుపడిన ఆంధ్రోళ్ల అతి తెలివితేటలు.. పాలకుల విభజించి పాలించే తెలివితేటల ముందు తెల్లబోయాయా? రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామంటే గుంటూరు-కృష్ణా జిల్లాల జనం రక్తం సలసల మండదేం? పల్నాటి పౌరుషం ఐసుగడ్డలా కరిగికూర్చుందేం? మాకూ పౌరుషముందని రోషం త న్నుకురాదేం? *విశాఖకు వెయ్యి కిలోమీటర్లు పైనున్న ‘సీమ పౌరుషం’ యాడకుపోయింది?*

_ఇంత చైతన్యరహిత, కుల సమాజంలో బతుకుతున్న సగటు ఆంధ్రోడి ఆవేదన ఇది._

*_విశాఖను రాజధానిగా ప్రకటించాలన్న సర్కారు నిర్ణయాన్ని, గుంటూరు-కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల, రాయలసీమ ప్రజలు ప్రతిష్ఠగా తీసుకోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది._*

చంద్రబాబు చెబితే, కన్నా మద్దతునిస్తేనో, కమలానందభారతి స్వామి తిడితేనో తప్ప స్పందించని కుల సమాజం నుంచి పౌరుషం, వీరత్వాన్ని ఆశించటం అవివేకమే.
*దశాబ్దాల నుంచి కులం కంపునే మహా ఇంపుగా భరించడం అలవాటయిన ఆంధ్రా సమాజం..* రాజధాని మార్పు ప్రయత్నం తర్వాత కూడా చైతన్యరహితంగా కనిపించడం చూస్తే శ్రీశ్రీ చెప్పింది నిజమేమోననిపించక మానదు. అసలు శ్రీశ్రీ గానీ, సిరివెన్నెల సీతరామశాస్త్రిగానీ ఆంధ్రోళ్ల వెధవాయిత్వం గురించి ముందే ఊహించి రాశారేమోననిపిస్తుంది.

పక్కనే ఉన్న తెలంగాణ ప్రజలు.. ప్రత్యేక రాష్ట్రం కోసం చావోరేవోగా సాగించిన పోరాటం, ప్రదర్శించిన ఐకమత్యం చూసి ఆంధ్రా సమాజం సిగ్గుతో చితికిపోవాలి. పార్టీలకు పాతరేసి ఒక్కగొంతుకతో నినదించిన తెలంగానం, ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ సమాజం చూపిన తెగువ చూస్తే, ఆంధ్రా సమాజం పౌరుషంతో రగిలిపోవాలి. సిగ్గుతో కుమిలిపోవాలి. కులం, మతం లేకుండా సాగిన తెలంగాణ సమాజం నేర్పిన పోరుపాఠాలు నిజానికి ఈ దే శానికే ఓ మార్గదర్శం. ఎన్నో ఏళ్లు పోరాడితే గానీ, వందలు, వేలమంది అమరులైతే గానీ, కేసీఆర్ లాంటి వ్యూహకర్త వల్ల రోడ్డుమార్గం పట్టిన ప్రజల పోరాటం వల్లగానీ తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం సిద్ధించలేదు. కానీ, ఆంధ్రాలో అమరావతి అలా కాదు. ప్రజలు పోరాడకుండానే వచ్చిన రాజధాని నగరం అది. దాని నిర్మాణానికి కేంద్రం వేల కోట్లు కుమ్మరించిన నగరమది. నగర నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తరలివచ్చి.. దేశంలోని నదుల నుంచి జలం, మట్టిని అక్కడ కలిపిన పుణ్యభూమి అది. ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతీక అది. మరి అలాంటి రాజధాని నగరాన్ని మరో చోటకు తరలిస్తుంటే స్పందించాల్సిన సమాజం.. చేవ చచ్చి, బిక్కమొహమేసి, 29 గ్రామాల ఆర్తనాదాలకే పరిమితమయి, మిగిలిన ప్రాంతాలు మాకేమిటన్న దిక్కుమాలిన, దిక్కులేని పలాయనవాదంతో గుడ్డిగుర్రాలకు పళ్లుతోముకుంటూ, చచ్చు పుచ్చు వాదనలతో తీరికూర్చిని చేసుకునే రచ్చబండ రాజకీయాలతో సాధించేదేమిటన్నది ప్రశ్న.

రాజధాని తరలింపు అంశం ఇప్పుడు 29 గ్రామాలకే ప్రతిష్ఠగా మారింది. ఉత్తరాంధ్రకు తప్ప, మిగిలిన ప్రాంతాలకు దాని వల్ల ప్రయోజనం లేదని తెలిసినా, రాజకీయ-కులతత్వంలో దశాబ్దాలు సహజీవనం చేసి, ఆ పిచ్చ నుంచి, ఆ ఉన్మాదం నుంచి బయటపడలేని ఆంధ్రా సమాజ చైతన్య రాహిత్యమే ఏలికలకు బ్రహ్మాస్త్రంగా మారిందన్నది మనం మనుషులం అన్నంత నిజం. ఆ కులోన్మాదం, ప్రజల చైతన్యరాహ్యింతోనే పాలకులు చలిమంటలు వేసుకుంటున్నారన్న నిజం తెలియని ఆంధ్రా ప్రజల అమాయకత్వాన్ని చూసి సిగ్గుపడాల్సిందే.

*_రాజధానిని తరలిస్తున్నారన్న అంశం కంటే.. అది కమ్మ వారికి నష్టమా? రెడ్లకు లాభమా? టిడిపికి శాపమా? వైసీపీకి వరమా? ఏ కులానిది పైచేయి? అన్న మతివిహీన చర్చలే తప్ప.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏమిటి అన్న సామాజిక స్పృహ ఆంధ్రా సమాజానికి లేకపోవడం దౌర్భాగ్యం._*

*గుంటూరు-కృష్ణా కమ్మవాళ్లది, రాయలసీమ రెడ్లది, ఉత్తరాంధ్ర బీసీలదన్న తీసివేతలు, కూడికల రాజకీయమే తప్ప.. మొత్తంగా అమరావతి మనది అన్న సమిష్టి కోణం ఏ కులంలోనూ కనిపించకపోవడం మరో దౌర్భాగ్యం.*

*_అది తమదేనని అత్యుత్సాహం ప్రదర్శించి, మిగిలిన కులాలను సొంతం చేసుకోనీయని కమ్మదనమే ఇంత కార్చిచ్చుకు కారణమని గ్రహించకపోవడం మరో ప్రారబ్ధం._*

*మరి బాబుకు నీతులు చెప్పి, రాజధానికి 30 వేల ఎకరాలు కావాలి. తాను రాజధానికి వ్యతిరేకం కాదు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. అమరావతిలోనే రాజధాని ఉండాలని వాదించిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాటిని బాబు కంటే స్పీడుగా నిర్మించి తన ఘనతేమిటన్నది కదా చూపాలి!* *మరి అది చేయకుండా మరొకచోటకు రాజధానిని తరలిస్తే అందులో ఏమిటి గొప్ప?*
 ```మాట మార్చడం, మడమ తిప్పడం అంటే ఇదేనా?``` _బాబు అవినీతి, ఆశ్రితపక్షపాతంపై ఆగ్రహోదగ్రుడైన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై విచారణ చేసి, అక్రమార్కులను శిక్షించకుండా ఈ ఆరునెలలు మీనమేషాలు ఎందుకు లెక్కబెట్టినట్లు?_

*అక్రమార్కుల అరాచకాలే నిజమైతే, వారిని నడిరోడ్డున నిలబెట్టి సంకెళ్లు వేసి శిక్షించడానికి అడ్డుకుందెవరు?*
*రాజధానిని మారిస్తే కమ్మ వర్గాన్ని దెబ్బతీసినట్లు మురిసిపోతే.. రేపు అదే విశాఖలోనూ ఆ వర్గమే అన్నింటా దర్శనమిస్తే, అప్పుడు రాజధానిని శ్రీకాకుళానికి మారుస్తారా?*
పోనీ ఆ స్థానాన్ని రెడ్లు ఆక్రమిస్తే, మళ్లీ వచ్చే కొత్త పాలకుడు రాజధానిని ఎక్కడికి మారుస్తారు? అంటే బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పినట్లు *రాజు మారితే రాజధాని మారాలా? అప్పుడు మద్రాసీలు తంతే కర్నూలుకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు, అక్కడ తెలంగాణ వాళ్లు తంతే బెజవాడకు వచ్చిన ఆంధ్రోడు..* ఇక విశాఖకు అంపశయ్యపై చేరాల్సిందేనా ? నిలువెల్లా గాయాలై శ్వాసకూడా పీల్చుకోలేనంతగా క్షతగ్రాతుడైన ఆంధ్రోడి చివరి మజిలీ ఏదీ అన్నది సగటు ఆంధ్రుడి ప్రశ్నలు. రాజకీయ కోణంలో కాకుండా, సామాజికపరంగా ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చే దమ్మెవరికి ఉంది?