..
madiki tochinadi...manasuki nachinadi.

Tuesday 7 January 2020

*సిగ్గుపడరా ఓ ఆంధ్రుడా..!*

 ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, గత ఆరు నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ లక్ష్యాల కోసం కొన్ని శక్తులు రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇవన్ని కూడా ఆందోళనకరంగా మారాయి.

*అయినా సరే ప్రజల్లో మాత్రం ఎటువంటి స్పందన లేదు.*

ముఖ్యంగా ఆంధ్రులు చాలా వరకు సైలెంట్ గా ఉన్నారు.

రాజధాని విషయంలో మనకెందుకులే, ఆ రైతులు ఇబ్బంది పడితే మనకేమిటిలే అనే ఉదాసీన వైఖరి ఇప్పుడు నిజంగా ఆందోళన కలిగిస్తుంది.

 ఒకప్పుడు ఆంధ్రుడు అంటే పౌరుషానికి ప్రతీక. కష్టపడే తత్త్వం, అందరూ బాగుండాలి అనే ఆలోచన.

తమలో తమకి ఎన్ని గొడవలు ఉన్నా పరాయి వాడు వస్తే ఎదురొడ్డి నిలుచున్న గతం.

కానీ ఇప్పుడు నిజంగానే అవన్నీ గత స్మృతులుగానే మిగిపోతున్నాయి.

“ఆంధ్రుడా నిన్ను కొన్ని మాటలు అంటాను భరించు…

నీకు భరించడం అలవాటే కదా… కనీసం పట్టించుకోవు కదా… అందుకే నేను కొన్ని మాటలు అంటాను భరించు…

*నీకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉన్నాయా…?*

*నీ భవిష్యత్తు గురించి నీకు అసలు బెంగ గాని భయం గాని ఉందా…?*

అవును నేను నిన్ను అడిగిన ప్రశ్నలు నీ శ్రేయోభిలాషిగానే అడిగాను…

ఎందుకంటే నాకు నిన్ను చూస్తే చిరాకుగా ఉంది…

నీ చేవ చచ్చిన మనస్తత్వం చూస్తే జాలేస్తుంది…

కనీస జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్న తీరు అవమానకరంగా ఉంది.

రాష్ట్ర విభజన సమయంలో రాజధాని లేకుండా విభజించారు..

రాజకీయ పార్టీలు ముందుకి వచ్చి విమర్శలు చేశాయి గాని నీ అంతట నువ్వోచ్చావా…?

భావోద్వేగంగా పోరాటం చేసావా…?

ప్రత్యేక హోదా లేదన్నారు. కనీసం నీ బిడ్డల భవిష్యత్తు కోసం అయినా ముందుకి వచ్చావా…?

ఒక్క పోరాటం అయినా నీ అంతట నువ్వు చేసావా…?

రైల్వే జోన్ లేదన్నారు.. కనీసం నీలో పౌరుషం కూడా ఎక్కడా నాకు కనపడటం లేదు…

ఎందుకు నువ్వు ఆంధ్రుడిగా చెప్పుకోవడం…

నా తెలంగాణా అంటూ నిన్నటి వరకు నీతో కలిసి ఉన్నవాడు ఏళ్ళకు ఏళ్ళు పోరాటం చేశాడు. నాకు అన్యాయం జరుగుతుందిరా ఆంధ్రోడా అంటూ నిన్ను అమ్మనా బూతులు తిట్టాడు…

అయినా నీకు బాధ లేదు.

కష్టపడి కట్టుకున్నావ్ అమరావతిని…

దాన్ని భ్రమరావతి అన్నా నీలో పౌరుషం లేదేంటి…?

ఇప్పుడు అదే అమరావతిని శ్మశానం అన్నారు….

అయినా సరే నీకు బాధ రావడం లేదు…

*ఇంకెప్పుడు నువ్వు ఆంధ్రుడిలా బ్రతికేది…?*

నువ్వు పుట్టిన నేల తల్లి గురించి ఎప్పుడురా ఆలోచించేది…

బాధపడటం కాదు సిగ్గు పడు…

ఎందుకు ఇలా ఉన్నాను అని సిగ్గు పడరా ఆంధ్రుడా…

మాయ మాటలు వింటూ బతికేసేయ్. ఇప్పుడు నువ్వు కట్టుకున్న రాజధానిని ఎవరో ఎక్కడికో తీసుకుపోతున్నారు