..
madiki tochinadi...manasuki nachinadi.

Thursday, 18 May 2017


నువు రావని తెల్సినా ఒప్పుకోకున్నది, నీ రాకకై వేచే మరుపు తెలియని మనసు...!  
నువు శిక్షించావని తెల్సినా పట్టించుకోకున్నది, నీకై ప్రాకులాడే పాపం ఎరుగని మనసు...!

Thursday, 27 April 2017

Be buzy like a bee 🐝

  !


బరువెక్కిన గుండెకు భోరున ఏడ్చే వెసులుబాటు ఇవ్వని బిజీ      
బ్రతుకు....
బలవంతపు నగవులతో బహుబాగు నటనలకు బదులు యివ్వలేని అయోమయపు మనస్సు..! 
బరువును ,మోసీ మోసీ.. బాధ కూడా..బలిష్టమైపోయింది..!

బతుకు బరిలోన భలే పోరాటం భూమి మీద పడినంతనే, భారీ ప్రహసనం..!

Monday, 3 April 2017

ఆధునిక #సమాజంలో_స్త్రీ

ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. ఇంటి సౌందర్యం ఇల్లాలి పనితీరు పైనే ఆధారపడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలను స్త్రీకి కట్టబెట్టింది ఆమెను ఇంట్లో కట్టిపడేయడానికి కాదు. కుటుంబ సంక్షేమం మొత్తం ఆమె చేతులకు ఇచ్చింది ఆమె ప్రజ్ఞను గమనించే.
భారతీయ ధర్మంలో స్త్రీని అగ్నితో పోల్చారు. అంటే అగ్ని ఎంత పవిత్రమైనదో స్త్రీ అంతే పవిత్ర మైనదని అర్థం. స్త్రీ దేవతలను పూజించే ఆచారం కేవలం భారతీయ సనాతన ధర్మానికి మాత్రమే సొంతం. స్త్రీలకు ఇంతటి గౌరవాన్నందించిన సనాతన భారతీయ ధర్మంలో జన్మించిన మనం ధన్యజీవులం.
ధర్మార్థ కామ మోక్షార్థి అయిన పురుషుడు వివాహమాడి తన భార్యతో కూడి యజ్ఞయాగాదులు చేసి పిత ఋణం, దేవ ఋణం, ఋషి ఋణాల నుండి ముక్తుడవుతాడు. పురుషునికి సంతాన భాగ్యాన్ని, విశేష గౌరవాన్ని, అమతత్వాన్ని ప్రసా దించేది భార్య మాత్రమే
కుటుంబ నిర్వహణలో ఆమె ఎన్నో పాత్రలు పోషిస్తుంది. శుచి, శుభ్రత, వంట తయారీ ఇంట్లో స్త్రీ బాధ్యత. అంటే ఇవన్నీ ఆమె పాటించి, కుటుంబ సభ్యులకు నేర్పడం ద్వారా ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఆమె ఒక వైద్యురాలు. పిల్లలకు విద్యా బుద్ధులునేర్పి మంచి గుణాలు, నడవడిక అలవాటు చేసి, సమాజానికి ఉపయోగపడే విధంగా పిల్లలను తయారు చేయడం ద్వారా ఆమె ఒక గురువు స్థానాన్ని పొందుతుంది. భర్తకు అనుగుణంగా నడచుకొని, ఆజ్ఞలు పాటించి, చెడుదారులు పట్టకుండా, జీవితంలో కావలసిన చోట మంచి సలహాలు చెప్పి, కుటుంబ గౌరవం నిలిపే వేళ ఆమె ఒక మంత్రి. ఇంటికి వచ్చే అతిథులను, బంధువులను, కుటుంబ సభ్యులను గౌరవించి, ఆదరించే వేళ ఆమె అన్నపూర్ణ. మన భారత కుటుంబంలో సంపాదించే బాధ్యత మగవారికి, దానిని ఖర్చుపెట్టే బాధ్యత స్త్రీకి ఉంటుంది. వచ్చిన సంపాద నలో కొంత మిగులు చేసి, మిగిలిన దానిని సక్రమంగా వినియోగించే వేళ ఆమె ఒక ఆర్థికవేత్త.

భర్త సంపాదన ఇంటి అవసరాలకు సరిపోని సమయంలో ఇల్లు నడవడానికి ఆమె కూడా కష్టపడి సంపాదించగల ధైర్యవంతురాలు స్త్రీ. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగల నిబ్బరం స్త్రీకి ఉంటుంది. ఓర్పు, సహనానికి ప్రతీక స్త్రీ. కుటుంబ సభ్యులందరి అవసరాలు తీరుస్తూ, ఆమె ముందుకు సాగుతుంది. కుటుంబంలోని ఆటుపోట్లను, జీవితం లోని కష్టాలను ఓర్పుతో, సహనంతో భరిస్తూ కుటుంబానికి ఆనందం కలిగించేందుకు ఆమె ఎప్పుడూ తపిస్తుంది. ఒక కుటుంబం అభివద్ధి పథంలో ముందుకు సాగుతుందంటే అది కేవలం స్త్రీ గొప్పతనం మాత్రమే. భార్యగా, అత్తగా, కుమార్తెగా, అక్కగా, చెల్లిగా, నాయనమ్మగా స్త్రీ కుటుంబంలో అనేక పాత్రలు పోషిస్తుంది.

కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలలో ఆమెదే ప్రధాన పాత్ర. ఆమె చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట కుటుంబం మీద ప్రభావం చూపుతాయి. ఆమె పాత్ర వల్ల కుటుంబంలో సంతోషం తాండవిస్తుంది. ఒక కుటుంబం లేదా పిల్లలు బాగుపడినా లేదా చెడిపోయినా దానికి బాధ్యురాలు స్త్రీయే. స్త్రీ శారీరిక శక్తిలో పురుషునికన్నా బలహీను రాలు అయినప్పటికీ, మానసిక శక్తిలో ఆమెకు ఎవరూ సాటిలేరు. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ ధర్మంలో స్త్రీయే ఇంటికి యజమానురాలు.
ఆధునిక సమాజంలో స్త్రీ పాత్ర మరెంతో పెరిగింది. స్త్రీలు ఒకవైపు ఉద్యోగ బాధ్యతలను నెరవేరుస్తూ, మరోవైపు కుటుంబాన్ని చూసుకుంటూ, కుటుంబ అభివద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. గ్రామం, పట్టణం ప్రాంతం ఏదైనా కావచ్చు; ఉన్నత, మధ్య, పేద తరగతి వర్గం ఏదైనా కావచ్చు; కులం, మతం, ఏదైనా కావచ్చు అన్ని చోట్ల కుటుంబాలలో స్త్రీ మూర్తే కీలక పాత్రధారి. పేరుకి భారతీయ కుటుంబాలు పురుషస్వామ్య కుటుంబాలు అయి నప్పటికీ, కుటుంబ చక్రం ముందుకు సాగటానికి ఆ కుటుంబాలలో స్త్రీల పాత్రే ప్రధాన కారణం. ప్రపంచమంతా భారతీయ కుటుంబ వ్యవస్థను వేనోళ్ళ కీర్తిస్తుందంటే ఆ గొప్పతనం మన మాతృ మూర్తులకే చెందుతుంది. అంతేకాకుండా నేడు అనేక రంగాలలో మహిళా శక్తి ముందుంటున్నది. కానీ నాగరికత పెరిగి సమాజం ముందుకు పోతున్న ఈ రోజులలో, స్త్రీలపై అత్యాచారాలు, అకత్యాలు జరుగుతున్నాయి. ఇదొక దురదృష్టకర పరిస్థితి. దీనిని కూడా ఈ సమాజం అధిగమిస్తుందని ఆశిద్దాం.

Thursday, 16 March 2017





మండే ఎండలలో చిరు చినుకుల విరి జల్లు..
మలయ మారుత చిరుగాలుల హాయిగొలిపే పరవళ్ళు....
మత్తు గొలిపే మృత్తిక సువాసనల గమ్మత్తైన ఇంద్రజాలపు ఆనవాళ్ళు...
మబ్బుల మాటున ప్రత్యక్షమయ్యే జగతి ఐక్యతలో మమేక మయ్యే సప్తవర్ణాల హరివిల్లు  ...!🌈

Friday, 10 March 2017




ఒక ప్రక్క మహిళా సాధికారత అంటూ..., మరోప్రక్క మహిళా రిజర్వేషన్ యిమ్మంటూ...!🤔
ఒక ప్రక్క మహిళలకు అపూర్వ గౌరవ మంటూ....,
మరోప్రక్క మహిళలను అసభ్య పదజాలంతో కించపరచుకుంటూ...!🤔
ఒక ప్రక్క మహిన మహా మానవీయత మహిళలదంటూ...,
మరో ప్రక్క మహా మాయగాళ్ళ మోసాలకి సైతం తలొగ్గి నడుచుకుంటూ...

వసంతం ముందే వచ్చేసింది..😍


వసంతం ముందే వచ్చేసింది..😍
  ఒక కొమ్మ మీద నుండి తాను ప్రియాతిప్రియంగా గొంతు సవరిస్తే.., అంతే మథురంగా.. తన ప్రియురాలికి బదులిస్తూ  టక్కున ప్రత్యక్షమయ్యింది ఆ మగ కోయిల! ఇక ఆ కోకిల జంట తమకు ఈ ప్రపంచంతో పనేముందనుకున్నాయేమో..., ఒకటే పాటలూ.. తనివి తీరని మాటలూనూ..!  అంతగా ఆనంద సంగీతంలో మునిగి తేలుతూ.., మధ్య మధ్యలో వేప పూతని కూడా రుచి చూస్తున్న ఆ కోకిల జంటని మా వేపచెట్టు పై చూసి .. నన్ను నేనే కాసేపు మైమరచిపోయాను..!😍

Tuesday, 7 March 2017

మార్పేముంది...

మార్పేముంది.. మహిళా దినోత్సవాలు మరలా మరలా.. మననం చేసుకోవడానికీ..!
మార్పేముంది.. మహిళ కి మరో మహిళే ప్రత్యక్ష నరకం చూపిస్తున్నంత వరకూ...!
 మార్పేముంది.. ఒక మాతృమూర్తే తనకు స్త్రీ శిశువు కలగకూడదని కలలు కంటున్నంత వరకూ..!
మార్పేముంది... తెగువ లేని మగువకు.. ఏటికోమారు శుభాకాంక్షలు మాత్రమే తెలుపుకుంటున్నందుకూ..!
మార్పేముంది... ముదుసలి ఐనా, పసికందైనా.. మృగాల చూపులు మారనంతవరకూ...!
మార్పేముంది... మాటమాటకీ మేమున్నామని మహిళా మనుగడను గుర్తుచేసుకోవాల్సిన దౌర్భాగ్యం మామూలైనంతవరకూ...!
మార్పేముంది.. సహనమే మహిళకు వ్యసనమైనంతవరకూ...!
మార్పేముంది... మహిళను మామూలు మనిషిగ సైతం చూడనంతవరకూ...!
మార్పేముంది.. మహిళా దినోత్సవాలు మరలా మరలా.. మననం చేసుకోవడానికీ..!